ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆ మూడు సినిమాలు రిలీజ్ అవ్వడానికి 32 ఏళ్లు పట్టింది!
on Mar 7, 2025
సినిమా నిర్మాణం అనేది ఖర్చుతోనూ, శ్రమతోనూ కూడుకున్న పని. కొందరు నిర్మాతలు తాము అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిర్మాణం పూర్తి చేసి రిలీజ్ చేస్తారు. మరికొందరికి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతుంటాయి. సినిమా ప్రారంభించిన రోజు నుంచి పూర్తయ్యేవరకు ఆ చిత్ర నిర్మాత రకరకాల ఇబ్బందులకు, మానసిక ఆందోళనలకు గురవుతారు. అలా కొన్ని సినిమాలు పూర్తి కావడానికి ఎంతో సమయం పడుతుంది. సినిమా ప్రారంభించి కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే సినిమా నిర్మాణం పూర్తి చేసుకొని రిలీజ్‌కి నోచుకోని సినిమాలు లెక్కకు మించి ఉంటాయి. కొందరు నిర్మాతలు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ సినిమాను రిలీజ్ చేసే తీరతారు. అలా సంవత్సరాల తరబడి నిర్మాణం జరుపుకొని విడుదలైన మూడు సినిమాలు ఉన్నాయి. ఎన్.టి.రామారావు హీరోగా నటించిన ఆ మూడు సినిమాలు అలాంటి సమస్యలు ఎదుర్కొని రిలీజ్ అవ్వడానికి 32 ఏళ్ళు పట్టింది.
తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మైల్‌స్టోన్‌గా, ఎవర్‌గ్రీన్ హిట్‌గా నిలిచిన సినిమా ‘లవకుశ’. శ్రీరాముడిగా ఎన్.టి.రామారావు, సీతగా అంజలీదేవి నటించిన ఈ సినిమాను పూర్తి చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. 1958లో ప్రారంభమైన ఈ సినిమా తెలుగులో తొలి పౌరాణిక రంగుల చిత్రం. తెలుగులో, తమిళ్‌లో ఒకేసారి నిర్మాణం జరుపుకున్న సినిమా ఇది. షూటింగ్ ప్రారంభమైన కొన్నాళ్ళకు నిర్మాత ఎ.శంకర్‌రెడ్డికి ఆర్థిక సమస్యలు రావడంతో చిత్ర నిర్మాణాన్ని ఆపేశారు. కొన్నాళ్లకు ఆర్థికంగా నిలదొక్కుకున్న శంకర్‌రెడ్డి మళ్ళీ సినిమాను ప్రారంభించారు. అయితే సినిమాలో లవకుశులుగా నటించిన పిల్లల శరీరాకృతిలో చాలా మార్పులు వచ్చాయి. అయిప్పటికీ సినిమాటోగ్రాఫర్ తన నైపుణ్యంతో ఆ తేడాలను కవర్ చేశారు. ఈలోగా చిత్ర దర్శకుడు సి.పుల్లయ్య ఆరోగ్యం క్షీణించడంతో ‘లవకుశ’ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను ఆయన కుమారుడు సి.ఎస్.రావు తీసుకున్నారు. అలా సినిమాను పూర్తి చేసి 1963 మార్చి 29న విడుదల చేశారు. ‘లవకుశ’ ఘనవిజయం సాధించి తెలుగు సినిమా చరిత్రలోనే ఓ క్లాసిక్‌గా నిలిచింది.
‘లవకుశ’ తర్వాత అత్యధిక సంవత్సరాలు నిర్మాణం జరుపుకున్న మరో చిత్రం ‘ఎవరు దేవుడు’. ఆరోజుల్లో ఎన్టీఆర్, జమున జంటను ప్రేక్షకులు ఎంతో ఆదరించేవారు. వీరిద్దరూ కలిసి 31 సినిమాల్లో నటించారు. వీరి మొదటి సినిమా ‘ఇద్దరు పెళ్లాలు’. 1969లో ఎ.వి.ఎం.రాజన్, షావుకారు జానకి జంటగా తమిళ్‌లో ‘తునైవన్’ పేరుతో ఓ సినిమా వచ్చింది. ఇందులో శ్రీదేవి తన ఐదేళ్ళ వయసులో మురుగన్ పాత్రలో నటించారు. తమిళ్‌లో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్మాత వాసుదేవ మీనన్ హక్కులు కొనుగోలు చేశారు. 1972లో ఎన్టీఆర్, జమున జంటగా ఎ.భీమ్‌సింగ్ దర్శకత్వంలో ‘ఎవరు దేవుడు’ పేరుతో చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. డి.వి.నరసరాజు, సి.నారాయణరెడ్డి, కె.వి.మహదేవన్ వంటి టాప్ టెక్నీషీయన్స్‌ను ఈ సినిమా కోసం తీసుకున్నారు. 10 రీళ్ళు పూర్తయిన తర్వాత ఆర్థిక కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. 5 సంవత్సరాలపాటు సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. ఈలోగా నిర్మాత వాసుదేవ మీనన్ అనారోగ్యంతో కన్నుమూశారు. 1977లో ఆయన కుమారులు హరిదాస్ మీనన్, రవి మీనన్ కొంత డబ్బు కూడగట్టుకొని చిత్ర నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నారు. అప్పుడు వారిద్దరూ ఎన్టీఆర్‌ను కలిశారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చారు. అలాగే జమున కూడా షూటింగ్‌కు సహకరించారు. అలా సినిమాను పూర్తి చేసి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికే ఎన్టీఆర్ ఇమేజ్‌లో చాలా మార్పులు వచ్చాయి. అడవిరాముడు, యమగోల, డ్రైవర్‌రాముడు, వేటగాడు వంటి సినిమాలతో మాస్ హీరోగా ఎన్టీఆర్ ప్రభ వెలిగిపోతోంది. ఆ సమయంలో ఆయన సాఫ్ట్ క్యారెక్టర్‌లో నటించిన ‘ఎవరు దేవుడు’ చిత్రాన్ని విడుదల చేసేందుకు పంపిణీదారులు ముందుకు రాలేదు. అలా మరి కొంతకాలం ఆలస్యం జరిగిపోయింది. అయితే ఎన్నో కష్టాలు పడి ఈ చిత్రాన్ని 1981 ఏప్రిల్ 4న విడుదల చేశారు. అంటే సినిమా ప్రారంభమైన 9 సంవత్సరాలకు విడుదలైంది. ఒక పక్క మాస్ క్యారెక్టర్స్‌తో యాక్షన్ సినిమాలు చేస్తూ స్టెప్పులు వేస్తున్న ఎన్టీఆర్ సినిమాలను ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్‌కి ‘ఎవరు దేవుడు’ చిత్రం నచ్చలేదు. అన్ని సంవత్సరాల శ్రమను వృధా చేస్తూ ఆ సినిమా ఫ్లాప్ అయింది.
‘ఎవరు దేవుడు’ తర్వాత నిర్మాణపరంగా ఎక్కువ సంవత్సరాలు తీసుకున్న సినిమా ‘ఎర్రకోట వీరుడు’. 1955లో ప్రముఖ దర్శకనిర్మాత హెచ్.ఎం.రెడ్డి తెలుగు, తమిళ భాషల్లో ‘గజదొంగ’ పేరుతో ఓ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి వై.ఆర్.స్వామి దర్శకత్వం వహించారు. సావిత్రి, బి.సరోజాదేవి హీరోయిన్లు కాగా రాజనాల, ఆర్.నాగేశ్వరరావు విలన్లు. అలాగే కొందరు తమిళ నటీనటుల్ని కూడా తీసుకున్నారు. ఈ సినిమా ప్రారంభమైన రోజు నుంచీ ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ సగానికిపైగా సినిమాని పూర్తి చేశారు. ఆ సమయంలోనే నిర్మాత హెచ్.ఎం.రెడ్డి కన్నుమూశారు. దాంతో సినిమా ఆగిపోయింది. అప్పటికే ఎన్టీఆర్ హీరోగా మంచి ఫామ్‌లో ఉండడంతో ఆగిపోయిన సినిమాను పూర్తి చేసేందుకు కొందరు ముందుకొచ్చారు. కొన్ని రోజులు ఆటంకం లేకుండా షూటింగ్ జరిగిన తర్వాత నటుడు ఆర్.నాగేశ్వరరావు మరణించారు. దీంతో మరోసారి సినిమా ఆగిపోయింది. ఆయన స్థానంలో తమిళ నటుడు నంబియార్‌ను తీసుకున్నారు. షూటింగ్ ప్రారంభించేలోపు దర్శకుడు వై.ఆర్.స్వామి సినిమా నుంచి తప్పుకోవడంతో తమిళ దర్శకుడు పార్థసారధి ఆ బాధ్యతను తీసుకున్నారు. దర్శకుడితోపాటు సినిమా టైటిల్‌ని కూడా ‘ధర్మవిజయం’గా మార్చారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొత్తానికి సినిమాను పూర్తి చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టాలనుకుంటున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు రావడంతో మరోసారి సినిమా ఆగిపోయింది. అన్నిరకాల కష్టనష్టాలను ఎదర్కొన్న నిర్మాతలు ఆ సినిమా గురించి పట్టించుకోవడం మానేశారు. అలా ఏళ్ళ తరబడి ఆ సినిమా ల్యాబ్‌లోనే ఉండిపోయింది. మంచి తారాగణం ఉన్న సినిమా కావడం వల్ల ఎలాగోలా సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తే మంచి ఫలితం ఉంటుందని కొందరు నిర్మాతలు భావించారు. అయితే ఆ సినిమా చుట్టూ ఎన్నో ఆర్థిక లావాదేవీలు ఉండడంతో భయపడి వెనక్కి తగ్గారు.
1973లో ‘ధర్మవిజయం’ చిత్రానికి మోక్షం లభించింది. ఎలాగైనా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్మాత టి.గోపాలకృష్ణ నిర్ణయించుకున్నారు. సినిమా చుట్టూ ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు వారికి డబ్బింగ్ రూపంలో ఓ సమస్య ఎదురైంది. 18 సంవత్సరాల క్రితం నిర్మించిన సినిమాకి ఇప్పుడు డబ్బింగ్ చెప్పమని ఎన్.టి.రామారావును అడిగేందుకు నిర్మాతలు భయపడ్డారు. దాంతో దశరథరామిరెడ్డి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. అయితే సినిమా టైటిల్‌ను తెలుగులో ‘ఎర్రకోట వీరుడు’గా, తమిళ్‌లో ‘తిరుడదే తిరుడన్’ అని మార్చారు. అప్పటికి ఎన్టీఆర్ నటించిన సూపర్‌హిట్ మూవీ ‘దేవుడు చేసిన మనుషులు’ విడుదలై ఘనవిజయం సాధించి శతదినోత్సవం పూర్తి చేసుకుంది. అంతేకాదు, ‘వాడేవీడు’ చిత్రం కూడా విడుదలై సూపర్‌హిట్ కావడంతో ఎన్టీఆర్ మంచి ఊపులో ఉన్నారు.
‘ఎర్రకోట వీరుడు’ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి అదే మంచి సమయంగా భావించిన నిర్మాతలు.. 1973 డిసెంబర్ 22న విడుదల చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ నటించిన రెండు సూపర్‌హిట్ సినిమాలు రిలీజ్ అయి ఉండడం వల్ల ‘ఎర్రకోట వీరుడు’ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అప్పుడు ప్రేక్షకులు, అభిమానులు ఆయన్ని చప్పట్లతో, విజిల్స్‌తో ఆహ్వానించారు. ఆ మరుక్షణమే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ పాత్రకు ఎన్టీఆర్ కాకుండా మరొకరు డబ్బింగ్ చెప్పడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. భారీ ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు వేరెవరో డబ్బింగ్ చెప్పారన్న వార్త మౌత్‌టాక్‌తో స్ప్రెడ్ అయిపోయింది. అంతటి భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాకి నిజంగా ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పి ఉంటే దేవుడు చేసిన మనుషులు, వాడే వీడు వరసలో ‘ఎర్రకోట వీరుడు’ మరో సూపర్‌హిట్ సినిమాగా నిలిచి ఉండేది. అలా ఎన్టీఆర్ నటించిన ఈ మూడు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి 32 సంవత్సరాలు పట్టింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
